UU Lalit Retirement : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌కు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ యూయూ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. గురునానక్ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు కావడం వల్ల సోమవారమే వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ లలిత్.. విధి నిర్వహణలో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రాజ్యాంగ ధర్మాసనాలు ఒకేసారి పనిచేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని, తన పదవీకాలంలో అది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తదుపరి సీజేఐ డీవై చంద్రచూడ్, ఆయన తండ్రి, మాజీ సీజేఐ వైవీ చంద్రచూడ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
'ఒకటో నంబర్ కోర్టు గదిలో నా ప్రయాణం ప్రారంభమైంది. జస్టిస్ వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్నప్పుడు ఓ కేసు వాదించేందుకు ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఇక్కడే నా ప్రయాణం ముగిసింది. నా బాధ్యతలను జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు అప్పగిస్తున్నా. నేను ఇక్కడ 37ఏళ్లు పనిచేశాను. రెండు రాజ్యాంగ ధర్మాసనాలు ఒకేసారి పనిచేయడం ఎన్నడూ చూడలేదు. కానీ నా పదవీకాలంలో ఒకరోజు మూడు రాజ్యాంగ ధర్మాసనాలు ఏకకాలంలో పనిచేశాయి. రాజ్యాంగ ధర్మాసనంలో భాగమయ్యేందుకు ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమాన అవకాశాలు ఉండాలి' అని పేర్కొన్నారు. ఏడాది మొత్తం కనీసం ఒక్క రాజ్యాంగ ధర్మాసనాన్నైనా నడిపిస్తానని ప్రమాణస్వీకార సమయంలో జస్టిస్ యూయూ లలిత్ వాగ్దానం చేశారు.
'పదవికే గౌరవం తెచ్చారు'
అంతకుముందు, తదుపరి సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. సీజేఐ లలిత్ ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ నుంచి నేరుగా బెంచ్‌కు బదిలీ అయిన అతికొద్ది మందిలో జస్టిస్ యూయూ లలిత్ ఒకరని గుర్తు చేశారు. ఎంతో నిగ్రహం పాటించే ఆయన.. తన పదవికి గౌరవం తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. సుప్రీంలోని ఇతర జడ్జిలు, న్యాయవాదులు సైతం సీజేఐ లలిత్ సేవలను కొనియాడారు.
74రోజుల పాటు..
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్.. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈనెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 నవంబర్ 10 వరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.