మనుషుల అవసరాలే ఆవిష్కరణలకు దారి తీస్తాయి. కొత్త వస్తువుల సృష్టికి ఊతం ఇస్తాయి. అలాంటి అవసరమే ఓ యువతిలో కొత్త ఆలోచనను సృష్టించింది. పాలు పొంగని పాత్రను తయారు చేసేలా చేసింది. ప్రతి ఇల్లాలు ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం చూపింది. మామూలు పాత్రకే కొద్దిగా మార్పులు చేసి పాలు పొంగకుండా తయారు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన హిమంగి అనే విద్యార్థిని.. ఈ పాలు పొంగని పాత్రను తయారుచేసింది. మహారాష్ట్ర ముంబయిలోని.. నెహ్రూ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన వెస్ట్రన్ ఇండియా ఫెస్టివల్లో ఈ ఆవిష్కరణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆవిష్కరణకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను సైతం పొందింది. తాను రూపొందించిన ప్రత్యేక పరికరాన్ని అమెరికాలో జరిగే ఐరిస్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు సిద్ధమైంది.
హిమంగి తయారు చేసిన పాలు పొంగని పాత్ర
"భారతీయుల ఇంట్లో పాలు పొంగడం సర్వసాధారణం. దీన్ని వల్ల మహిళలకు కొన్నిసార్లు పనిభారం ఎక్కువవుతుంది. ఆ సమస్యలను తీర్చేందుకే ఈ ప్రత్యేక పాత్రను తయారు చేశాను. సాధారణంగా మనం వాడే పాత్రలాగే ఇది ఉంటుంది. కాకపోతే పైన ఎక్కవ వైశాల్యంతో ఉన్న మరొక పాత్రను అదనంగా జత చేస్తాం. పాలు మరిగి.. అవి ఎక్కువ ఒత్తిడితో పైకి వచ్చినప్పుడు ఆ పాత్ర ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది."
--హిమంగి, విద్యార్థిని
ఒక రోజు ఇంట్లో పాలు మరిగిస్తూ.. వేరే పనిలో నిమగ్నమైనప్పుడు అవన్నీ పొంగిపోయాయని హిమాంగి చెప్పుకొచ్చింది. ఇదే సమస్య అందరి ఇళ్లలోనూ ఉంటుందని ఆమె గ్రహించినట్లు తెలిపింది. దీనికి పరిష్కారం కనుగొనాలని భావించి.. ఈ పరికరాన్ని తయారు చేసినట్లు వివరించింది. తమ కూతురు పాలు పొంగని పాత్రను తయారు చేసినందుకు హిమంగి తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు.
విద్యార్థిని ఆవిష్కరణను పరీశిలిస్తున్న అధికారులు