తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రిమినల్​ కేసుల్లో వేసే ఛార్జ్​షీట్‌ను ఆన్‌లైన్​లో అందుబాటులో ఉంచలేం: సుప్రీంకోర్టు - బిహార్​ కులగణనపై తీర్పునిచ్చిన సుప్రీం

పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు క్రిమినల్‌ కేసుల్లో వేసే ఛార్జ్‌షీట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. చార్జ్‌షీట్‌ను ఆన్‌లైన్‌ వేదికల్లో అందుబాటులో ఉంచలేమన్న సుప్రీంకోర్టు.. ఇది సీఆర్​పీసీలోని నిబంధనలకు ఇది విరుద్ధమని తెలిపింది. ఎఫ్​ఐఆర్​లపైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, బిహార్​లో కుల గణనపై దాఖలైన పిటిషన్ల విచారణకు సర్వోన్నత న్యాయస్థాన తిరస్కరించింది.

charge sheets case in supreme court
charge sheets case in supreme court

By

Published : Jan 20, 2023, 8:24 PM IST

Updated : Jan 20, 2023, 8:49 PM IST

పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు క్రిమినల్‌ కేసుల్లో వేసే ఛార్జ్‌షీట్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. స్వేచ్ఛ పొందేందుకు అవి ప్రజా దస్త్రాలు కావని వాటిని జన బాహుళ్యంలో ఉంచలేమని.. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఛార్జ్‌షీట్లు పౌరులందరికీ అందుబాటులో ఉంచాలని సౌరవ్‌ దాస్‌ అనే జర్నలిస్ట్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

చార్జ్‌షీట్‌ను ఆన్‌లైన్‌ వేదికల్లో అందుబాటులో ఉంచలేమన్న సుప్రీంకోర్టు.. ఇది సీఆర్​పీసీలోని నిబంధనలకు ఇది విరుద్ధమని వెల్లడించింది. అటు ఎఫ్​ఐఆర్​ల పైనా స్పందించిన సుప్రీంకోర్టు.. కేసుతో సంబంధం లేని వారికి దానిని ఇవ్వడం దుర్వినియోగానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. అయితే.. ఎఫ్‌ఐఆర్‌ను ఛార్జ్‌షీట్‌తో సరిపోల్చలేమని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌.. సమాచారాన్ని స్వచ్ఛందంగా అందుబాటులో ఉంచడం ప్రభుత్వ విభాగం బాధ్యత అని పేర్కొన్నారు. ఛార్జ్‌షీట్లలో కొంత సమాచారం లీక్‌ అవడం వంటివి అసత్య వార్తలు, గందరగోళానికి దారి తీస్తుందన్నారు. అయినప్పటికీ చార్జ్‌షీట్లను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

బిహార్​ కుల గణన విషయంలో జోక్యం చేసుకోలేం..!
బిహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన ఆపాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్​ గవాయ్, జస్టిస్ విక్రమ్‌ నాథ్‌ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇవి పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ పిటిషన్లు కావని పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌ పిటిషన్లని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పట్నా హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఏ కులానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో తామెలా ఆదేశాలు ఇవ్వగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో బిహార్ ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగింది. కాబట్టి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కులగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉందని, బిహార్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేయాలని.. మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై హైకోర్టునే ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

Last Updated : Jan 20, 2023, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details