తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2023, 10:11 PM IST

Updated : Jan 23, 2023, 10:17 PM IST

ETV Bharat / bharat

2023 బడ్జెట్‌: మోదీ 'సర్కారు వారి పాట'.. దూకుడు తగ్గనుందా?

2024 ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మోదీ సర్కారు.. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కాస్తా ఆలోచించి అడుగేసేలాగా ఉంది. కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్నిఈసారి భారీగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

central-govt-disinvestment-in-2023-budget
బడ్జెట్ 2023 కేంద్రం అంచనాలు

కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకెళ్తున్న మోదీ సర్కారు.. ఎన్నికల బడ్జెట్‌లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్నిఈసారి 40 వేల కోట్లకే పరిమితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆమడ దూరంలో నిలవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం ఇందుకు కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమో లేదా అందులోని ప్రభుత్వం వాటాను తగ్గించుకోవడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ దూకుడుగానే ఉంది. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీనే ఓ సందర్భంలో తేల్చి చెప్పారు. నష్టాలు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపలేమని స్పష్టం చేశారు. ఇందుకోసం వ్యూహాత్మకం, వ్యూహాత్మకం కాని రంగాలను ప్రభుత్వం వర్గీకరించింది. వ్యూహాత్మకం కాని రంగాలకు చెందిన వాటిని పూర్తిగా ప్రైవేటీకరించడమో, విలీనం చేయడమో, లేదంటే పూర్తిగా మూసివేయడమే తమ విధానం అని కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే గత బడ్జెట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబడి అంచనాలు ప్రకటిస్తూ వచ్చింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.65 వేల కోట్లను కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో రూ.31 వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సమకూరాయి. బడ్జెట్‌ లక్ష్యంలో ఇది సగమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలే గడువు ఉంది. ఈలోగా మిగతా లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. 2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏకంగా రూ.లక్షా 75 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత రూ.78 వేల కోట్లకు అంచనాలను సవరించారు. వాస్తవంలో ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది కేవలం రూ.13,531 కోట్లు మాత్రమే.

2024 ఎన్నికల ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే. సార్వత్రిక ఎన్నికలకు ముందే 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడుల ఉపసంహరణపై మునుపటి దూకుడును ప్రదర్శిస్తే విపక్షాలకు మోదీ సర్కారు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. ఈ కారణంతో ఈసారి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.40 వేల కోట్ల రూపాయలకు మించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

చమురు సంస్థ బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం ఎప్పటినుంచో భావిస్తోంది. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ పెరగడం ప్రతికూలంగా మారింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే వస్తువుల రవాణా మరింత ఖరీదై వాటి ధరలకు మరింత రెక్కలొస్తాయి. ఈ కారణంగానే ప్రభుత్వరంగ చమురు సంస్థలు గత కొంతకాలంగా ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. నష్టాల భారాన్ని మోస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బీపీసీఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల ముందు కార్మిక వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఇష్టం లేక ఎప్పటి నుంచో ప్రైవేటీకరణ లిస్టులో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Last Updated : Jan 23, 2023, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details