Clarification On Polavaram Water level : పోలవరంపై పార్లమెంటులో కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. రిజర్వాయర్ లో నీటినిల్వ సామర్థ్యంపై జల్‌శక్తి శాఖ లోక్‌సభలో సమాధానమిచ్చింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని తేల్చిన కేంద్రం... తొలిదశలో ఆ మేరకే నిల్వ చేయనున్నట్లు వెల్లడించింది. తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంతవరకేనని కేంద్రం స్పష్టంగా చెప్పింది. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023కే పూర్తికావాల్సి ఉందన్న కేంద్రం.. 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయం, పునరావాసం ఖరారైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 11,677 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు తెలిపింది. సహాయం, పునరావాసం మార్చికే పూర్తికావాల్సి ఉన్నా జాప్యం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఆయా వివరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు.
ముంపుపై స్పష్టత...అంతకు ముందు... ఈ ఏడాది జనవరి 25న పోలవరం సాంకేతిక అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాలతో దిల్లీలో జరిగిన సమావేశంలో ముంపు ముప్పు లేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ముంపు ముప్పంటూ.. తెలంగాణ సహా అభ్యంతరాలు లేవెనత్తిన ఎగువ రాష్ట్రాల అనుమానాలు నివృత్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు తోసిపుచ్చిన జలసంఘం.. ఇప్పటికే అధ్యయనం పూర్తైందని, మరోసారి అధ్యయనం చేసే అవకాశమే లేదని తేల్చిచెప్పింది.