కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సాధారణ అర్హత పరీక్ష (సెట్) ఈ ఏడాది సెప్టెంబరులో ఉండవచ్చని ప్రధానమంత్రి కార్యాలయ, ప్రజాఫిర్యాదుల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణకు కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పడుతుందన్నారు. తద్వారా గ్రూప్ 'బి'తోపాటు 'సి' (నాన్ టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సెట్' యువతకు ఓ వరం లాంటిదని, ముఖ్యంగా సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశమన్నారు.
అవసరాలకు తగ్గట్టు..
దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర రిక్రూటింగ్ ఏజెన్సీలుగా ఉన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ (ఆర్‌ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) వాటి అవసరాలకు తగ్గట్టు భర్తీ ప్రక్రియలను కొనసాగిస్తాయని.. ఆయా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కోసం ప్రాథమిక పరీక్షగా 'సెట్' దోహదపడుతుందని మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు ఎన్‌ఆర్‌ఏ ఓ స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి గల సంస్థగా సహకరిస్తుందన్నారు.
ఇదీ చదవండి:సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు