తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పదోన్నతుల్లో ఆ రిజర్వేషన్లు రద్దు'.. కేంద్రం స్పందన ఇదే.. - ప్రభుత్వోగుల పదోన్నతులు

Reservation in Promotion: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తే అశాంతికి దారితీసే అవకాశం ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని.. పదోన్నతుల్లో రిజర్వేషన్లను అనుమతిస్తే పాలనావ్యవస్థల్లో ఇబ్బందులేవీ తలెత్తవని తెలిపింది.

Reservation in Promotion:
పదోన్నతుల్లో రిజర్వేషన్లు

By

Published : Apr 2, 2022, 8:32 AM IST

Reservation in Promotion: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను రద్దు చేస్తే అది ఉద్యోగుల్లో అశాంతికి, వ్యాజ్యాల సంఖ్య పెరుగుదలకు దారితీస్తుందేమోనని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజ్యాంగ నిర్దేశం, న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగానే దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి ధర్మాసనానికి తెలిపింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లను అనుమతించకపోతే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వాటి ద్వారా కల్పించిన ప్రయోజనాలను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. దీనివల్ల వారి వేతనాలను, ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారి పింఛన్లను సవరించాల్సి వస్తుందని, కొంత మొత్తాన్ని తిరిగి వసూలు చేయాల్సి ఉంటుందని వివరించింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లను అనుమతిస్తే పాలనావ్యవస్థల్లో ఇబ్బందులేవీ తలెత్తవని తెలిపింది. ఉద్యోగుల పనితీరు మెరుగుదలకు, వారిలో పోటీతత్వాన్ని పెంచేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని 75 విభాగాలు, మంత్రిత్వశాఖల్లో ప్రస్తుతం మొత్తం 27,55,430 మంది ఉద్యోగులు ఉన్నారని వారిలో ఎస్సీలు 4,79,301 మంది కాగా, ఎస్టీలు 2,14,738 మంది, ఓబీసీలు 4,57,148 మంది ఉన్నారని వివరించింది. విభాగాల వారీగా సమగ్ర వివరాలు తెలియకుండా పదోన్నతుల్లో రిజర్వేషన్లకు నిబంధనలు ఖరారు చేయలేమని, అది న్యాయస్థానాలు చేయాల్సిన పనికూడా కాదని జనవరి 28నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి :కర్ణాటకలో కాంగ్రెస్​కు 150 సీట్లు తేవాలి: రాహుల్

ABOUT THE AUTHOR

...view details