General Bipin Rawat House: తమిళనాడు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. ఈ వార్త విన్న రావత్ మామయ్య భరత్ సింగ్ రావత్(70) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్ 2018లోనే స్వగ్రామానికి వచ్చారని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రిటైర్మెంట్ కాగానే ఊర్లో ఇళ్లు నిర్మిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
పౌడీ గడ్వాల్ జిల్లాలోని సైనా గ్రామంలో ప్రస్తుతం భరత్ సింగ్ కుటుంబం మాత్రమే నివసిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రావత్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారని భరత్ సింగ్ చెప్పారు. రావత్ 2018లో ఊరికి వచ్చినప్పుడు కులదేవతకు పూజలు చేసినట్లు తెలిపారు. పుట్టిన ఊరిపట్ల రావత్ ఎంతో అనుబంధాన్ని కలిగి ఉండేవారని వెల్లడించారు. రిటైర్ అయ్యాక ఊరి కోసం ఏదైనా చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో గ్రామానికి వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. తన అల్లుడి కోరిక తీరలేదని కన్నీటి పర్యంతమయ్యారు భరత్ సింగ్.
దెహ్రాదూన్‌లో ఇళ్లు నిర్మాణం..
పుట్టినగడ్డపై ఎంతో మమకారం చూపే బిపిన్ రావత్ తమ రాష్ట్ర రాజధాని దెహ్రాదూన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలని కలలు కన్నారు. ఈ క్రమంలో నగరంలో సిల్వర్ హైట్స్ కాలనీలో తన ఇంటిని నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి గత వారమే భూమిపూజ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమానికి రావత్ భార్య మధులిక వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తమకు మిఠాయిలు కూడా పంచినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, బుధవారం రావత్ మరణ వార్త తెలియగానే భవన నిర్మాణ కూలీలు, స్థానికులు షాక్‌కు గురయినట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని చెప్పారు.
తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
ఇదీ చదవండి:ఆరేళ్ల క్రితం మృత్యువును జయించి.. అదే హెలికాప్టర్ ప్రమాదంలో..
చాపర్ క్రాష్‌లో సీడీఎస్ రావత్ దుర్మరణం