Caste Politics in Goa: పర్యాటకులకు పరిచయం అక్కర్లేని రాష్ట్రం... గోవా! సాగర తీరాలతో ఆహ్లాదం పంచే ఈ ప్రాంతంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వేడి రాజేశాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సాధారణంగా ఎన్నికలన్నీ కుల రాజకీయాలపైనే నడుస్తాయి. గోవాలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడి సంస్కృతి వేరు. పెద్దగా పట్టింపులు ఉండవు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తారు. అయితే, శాసనసభ ఎన్నికల పుణ్యమాని ఇప్పుడు ఇక్కడ కూడా కుల రాజకీయాలు పుట్టుకొచ్చాయి!
18 స్థానాల్లో వారిదే హవా...
AAP CM Candidate in Goa: రాష్ట్రంలో మొత్తం 40 నియోజకవర్గాలు ఉండగా... భండారీలకు 18 చోట్ల మంచి పట్టుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆప్ అధినేత కేజ్రీవాల్... భండారీ సమాజ్‌కు చెందిన అమిత్ పాలేకర్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఈ పరిణామంతో ఇతర పార్టీలు కూడా కులాల వారీగా ఓట్లను ఒడిసిపట్టే వ్యూహాలకు పదును పెట్టాయి. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేజ్రీవాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా... మొత్తంగా కేవలం నలుగురు భండారీలకే టికెట్లు ఇచ్చారని ఆ వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన ఆరుగురికి భాజపా, ముగ్గురికి కాంగ్రెస్ సీట్లు కేటాయించాయి.
ఓటర్లు పట్టించుకోరు!
"భండారీలు అధిక సంఖ్యలో ఉన్నా, పదవుల్లో మాత్రం తగిన ప్రాధాన్యం దక్కడంలేదన్న ప్రచారం వినిపిస్తోంది. ఇదే సామాజికవర్గానికి చెందిన రవి నాయక్‌కు 28 ఏళ్ల కిందట ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. కుల రాజకీయాలకు స్థానికంగా పెద్ద ప్రాధాన్యం లేదు. దీని గురించి ఎవరూ అతిగా ఆలోచించరు" అని సీనియర్ పాత్రికేయుడు కిశోర్ నాయక్ గావ్కర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆప్ సీఎం అభ్యర్థి పాలేకర్ మాత్రం... తమవి కుల రాజకీయాలు కాదన్నారు. ఓబీసీల ప్రాతినిధ్యం పెంచి, వారి అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేయడమే ఆప్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. "గోవాలో ఓబీసీల ఓట్లే ఎక్కువే. రాజకీయ పార్టీలన్నీ వీరిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తప్పితే, ఏనాడూ వారి అభివృద్ధిని కాంక్షించలేదు. అయితే, కేజ్రీవాల్ మాతో మాట్లాడారు. ఈ పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. తమకు అత్యధిక ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీకే మద్దతు పలకాలని మా సామాజికవర్గం భావిస్తోంది" అని గోమంతక్ భండారీ కమ్యూనిటీ అధ్యక్షుడు అశోక్ నాయక్ తెలిపారు. భండారీల తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్న ఖర్వా వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీల మద్దతును కూడగట్టేందుకు భాజపా, కాంగ్రెస్‌లు వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి.
- గోవా ఓటర్లలో హిందువులు 65% కాగా, క్రైస్తవులు 30%, ముస్లింలు 2.81%, ఇతరులు మరో 2.19% ఉన్నారు.
- హిందువుల్లో ఓబీసీలకు 30-40% ఓట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలో మొత్తం 19 ఉపకులాలు ఉండగా, వాటన్నింటిలో భండారీల సంఖ్యే ఎక్కువ. దీంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:ఆయారాం- గయారాం.. గోవాలో 'వలస' రాజకీయం
తాను ఓడినా.. శత్రువు గెలవొద్దు.. యూపీలో 'మాయా' స్కెచ్!