బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచార గడువు ముగిసింది. ఈనెల 7న 78 స్థానాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2.35 కోట్ల మంది ఓటర్లు 1,200 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
- ఎన్నికలు జరుగుతున్న జిల్లాలు: 19
- మొత్తం సీట్లు: 78
- మొత్తం ఓటర్లు: 2.35 కోట్లు
- అభ్యర్థులు: 1,200
- పోలింగ్ కేంద్రాలు: 33,500
కీలక నేతలు..
మూడో విడతలో బరిలో నిలిచిన వారిలో కీలక నేతలు ఉన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి, రాష్ట్ర మంత్రులు సురేశ్ శర్మ, ప్రమోద్ కుమార్ మరోమారు తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలని చూస్తున్నారు. వారితో పాటు కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్ కాంగ్రెస్ తరఫున బిహార్గంజ్ నుంచి బరిలో నిలుస్తున్నారు.