కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 3న మరోసారి కేంద్రంతో సమావేశం కానున్న నేపథ్యంలో రైతుసంఘాల నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు కీలక విషయాలు వెల్లడించారు.
తమ డిమాండ్లు నెరవేర్చకుంటే దిల్లీకి వెళ్లే ఇతర మార్గాలను నిర్బంధిస్తామని హెచ్చరించారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
''రైతు సంఘాలను విడగొట్టాలని కేంద్రం ప్రయత్నించింది. కానీ అది జరగదు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్రం.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటుచేయాలి. లేకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తాం.''
- దర్శన్ పాల్, రైతు సంఘాల నాయకుడు
వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కితీసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మరో నేత గుర్నామ్ సింగ్ ఛదోనీ. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.