మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి బీటలువారనున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. మహావికాస్ ఆఘాడీపై ఒంటి కాలిపై లేచిన మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్ ఉన్నట్టుండి స్వరం మార్చారు. భాజపా, శివసేనకు మధ్య శత్రుత్వం ఏమీ లేదని అన్నారు. ఇదిలా ఉంటే శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలను బలపరుస్తున్నాయి.
ఫడణవీస్ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో శివసేనతో పొత్తు పెట్టుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాలని సూచించినట్లు మహా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వీటిని నిజం చేసేలా.. పఢణవీస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చేశారు.
"భాజపా, శివసేన ఎప్పుడూ శత్రువులు కాదు మిత్రులే. ప్రజాభివృద్ధి కోసమే వ్యతిరేకంగా పోరాడాయి. వారు ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మమ్మల్ని విడిచిపెట్టారు"
-దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత
ఇదిలా ఉంటే మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
"భాజపా, శివసేనలు శత్రువులు కాదని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఈ మాటలు నూటికి నూరుపాళ్లు నిజం. అయితే దీని అర్థం ఇరుపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కాదు."