దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్న తరుణంలో.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్‌తో.. సమావేశాలు సజావుగా సాగుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రపతి ప్రసంగంతో..
శుక్రవారం.. ఇరుసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
అయితే సాగుచట్టాలపై పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్షానికి చెందిన 16 పార్టీలు ప్రకటించాయి. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
కొవిడ నిబంధనలు..
గత పార్లమెంట్ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి.
కరోనా కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు అయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో జరిగిన సమావేశాల్లో.. శని, ఆదివారాల్లోనూ పార్లమెంట్ కార్యకలాపాలు సాగించాయి. ఈసారి మాత్రం ఆయా రోజుల్లో సభలు ఉండవు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు భాగాలుగా విభజించింది కేంద్రం. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్ మార్చి 8న తిరిగి సమావేశమవుతుంది.