Brain dead organ donation: వివాహానికి గంటల వ్యవధి ఉందనగా.. వధువు స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తే యువతి బ్రెయిన్ డెడ్ అయిందని తేలింది. ఈ బాధలోనూ బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆమె తల్లిదండ్రులు. యువతి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఏం జరిగిందంటే..
Brain dead bride: కర్ణాటకకు చెందిన చైత్ర ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం చిక్కబళ్లపురలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఫిబ్రవరి 7న ఆమె వివాహం జరగాల్సి ఉంది. ముందురోజు కోలార్ జిల్లా శ్రీనిపాసపురలో నిర్వహించిన వివాహ రిసెప్షన్లో వధువు స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమని భావించిన డాక్టర్లు.. బెంగళూరుకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. తీరా అక్కడికి వెళ్లేసరికి యువతికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తేలింది. ఐదు రోజులు చికిత్స అందించిన బెంగళూరు వైద్యులు.. చివరకు యువతి బ్రెయిన్ డెడ్ అయిందని ప్రకటించారు.