Boris Johnson India tour: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను రూ.వేల కోట్లు మోసగించి లండన్ పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అప్పగింతపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ 'క్లిష్టతరం'గా మారిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్.. దిల్లీలో విలేకరులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అప్పగింతపై విలేకరులు ప్రశ్నించగా.. పైవిధంగా సమాధానమిచ్చారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తామూ కోరుకుంటున్నామని బోరిస్ జాన్సన్ అన్నారు. భారత్ నుంచి ప్రతిభ గల వ్యక్తులు రావడానికి తామెప్పుడూ ఆహ్వానం పలుకుతామని చెప్పారు. అదే సమయంలో తమ న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని భారతీయ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించబోమన్నారు.