తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చల్లారని సరిహద్దు రగడ- ఎంపీ కోసం గాలింపు

అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు రగడ చల్లారడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ కె.వన్లాల్​వేనా కోసం అసోం పోలీసులు దిల్లీకి చేరుకున్నారు. ఆయన నివాసానికి సమన్లు అతికించారు. మరోవైపు తమ రాష్ట్ర పౌరులెవరూ మిజోరం వెళ్లొద్దంటూ అసోం ప్రభుత్వం గురువారం జారీ చేసిన ప్రయాణ సూచనలు వివాదాస్పదమవుతున్నాయి.

Border clashes
సరిహద్దు రగడ

By

Published : Jul 31, 2021, 7:57 AM IST

అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య 'సరిహద్దు' గొడవ మరింత బిగుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం రాజ్యసభ ఎంపీ కె.వన్లాల్‌వేనా కోసం అసోం పోలీసులు శుక్రవారం దిల్లీకి చేరుకున్నారు. అతని నివాసం, మిజోరం హౌస్‌లో గాలించారు. ఎంపీ కనిపించకపోవడం వల్ల ఆయన నివాసానికి సమన్లు అతికించారు. కఛార్‌ జిల్లాలోని దోలాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అసోం పోలీసులు తమ రాష్ట్రంలో మళ్లీ అడుగుపెడితే కాల్చి పారేస్తామని వన్లాల్‌వేనా.. పార్లమెంట్‌ ఆవరణలో బుధవారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

"మా పోలీసులను అసోం పోలీసులు వెనక్కి తోశారు. వారే ముందు కాల్పులకు ఆదేశాలిచ్చారు. వారు అదృష్టవంతులు. అందరినీ చంపలేదు. మళ్లీ మా ప్రాంతంలోకి అడుగుపెడితే అందరినీ చంపేస్తాం"

-వన్లాల్‌వేనా, రాజ్యసభ సభ్యుడు

అసోం-మిజోరం సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అసోం పోలీసులు మరణించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు తమ రాష్ట్ర పౌరులెవరూ మిజోరం వెళ్లొద్దంటూ అసోం ప్రభుత్వం గురువారం జారీ చేసిన ప్రయాణ సూచనలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అసోం ప్రభుత్వం సమర్థించుకుంది. మిజోరం పౌరులు ఏకే-47 ఇతర అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్నారని... అందుకే జారీ చేసినట్లు పేర్కొంది.

అసోం, మిజోరం సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 306 వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పహారా కాస్తున్నా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రహదారులపై ఆందోళనకారులు లేరని, దిగ్బంధనం కొనసాగడం లేదని అసోం అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. స్థానికులు మాత్రం రాకపోకలు ఆగిపోయాయని చెబుతున్నారు.

అసోం సీఎంపై క్రీమినల్‌ కేను

సరిహద్దు హింసకు సంబంధించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, నలుగురు సీనియర్‌ పోలీసు అధికారులు మరో ఇద్దరు పరిపాలన అధికారులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details