Bomb Threat In Bangalore Schools Today : కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 48 స్కూళ్లకు శుక్రవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. స్కూల్లో బాంబు పెట్టామని దుండగులు ఈమెయిల్స్ పంపారు. ఈ నేపథ్యంలో పాఠశాలల యజమాన్యాలు అప్రమత్తమై.. విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు పంపాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో పాఠశాలల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన పాఠశాలల వద్దకు చేరుకుని పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.
'పాఠశాలల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తు తెలియని ఒక ఈమెయిల్ నుంచి మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందిన వెంటనే బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు చేరుకున్నాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అక్కడి నుంచి పంపేశాం. ఈ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కూడా పాఠశాలల ఆవరణలో కనిపించలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. ఇవి బూటకపు సందేశాలని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది' అని పోలీసులు తెలిపారు.
మరోవైపు.. స్కూళ్లకు దుండగుల బెదిరింపుల నేపథ్యంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్‌లోని ఎన్ఈవీ పాఠశాలకు సందర్శించారు. 'నేను ఇంట్లో టీవీ చూస్తున్నాను. మా ఇంటికి ఎదురుగా ఉన్న స్కూల్‌కు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఇక్కడికి చేరుకున్నా. ఇలాంటి బెదిరింపుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. ఈ బెదిరింపులు.. కొందరు అల్లరి మూకలు చేసి ఉండవచ్చు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటాం. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీ పిల్లలను రక్షించేందుకు మేం ఉన్నారం' అని డీకే శివకుమార్ తెలిపారు.
సిద్ధరామయ్య స్పందన..
బెంగళూరులోని పాఠశాలలకు బెదిరింపులు రావడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 'ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. పాఠశాలలను తనిఖీ చేసి భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించాను' అని తెలిపారు. మరోవైపు, ఈ విషయమై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ ట్వీట్ చేశారు. 'సిటీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బాంబు డిటెక్షన్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. బెదిరింపు మెయిల్స్ బూటకమని తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయిట అని ఆయన ఎక్స్(ట్విట్టర్)లో వివరించారు.