మహారాష్ట్రలో రాజకీయాలు(Maharashtra politics) వేడెక్కాయి. అక్కడ మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి నారాయజణ్ రాణే శుక్రవారం ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు దిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్ పటేల్‌లు కూడా దేశ రాజధానిలోనే ఉండడంతో ఊహాగానాలు వ్యాపించాయి. శివ సేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) ప్రభుత్వం(Maha Vikas Aghadi government) ఏర్పడి శనివారం నాటికి రెండేళ్లు పూర్తి కానుండడం గమనార్హం.
తొలుత నారాయణ్ రాణే రాజస్థాన్‌లోని జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ "మహారాష్ట్రలో మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది" అని చెప్పారు. దీనిని వివరించమని కోరినప్పుడు "ప్రభుత్వాలు కూలగొట్టడం, ఏర్పాటు వంటివి రహస్యంగా జరుగుతాయి. బహిరంగంగా వీటిపై చర్చలు జరపరు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ దీనిపై మాట్లాడారు. అది నిజమవుతుందన్న ఆశాభావం ఉంది" అని అన్నారు. దిల్లీలో ఫడణవీస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం.