BJP Public Meeting at Toopran in Telangana : తెలంగాణలో ఈసారి ఒక కొత్త సంకల్పం కనిపిస్తోందని.. బీజేపీను అధికారంలోకి తేవాలని ప్రజల్లో సంకల్పం మొదలైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. గతంలో నవంబరు 26న దురదృష్టకర ఘటన జరిగిందని.. ఆ అసమర్థ ప్రభుత్వం వల్ల నవంబరు 26న దేశంలో ఉగ్రదాడి(26/11 Mumbai Terrorist Attack) జరిగిందని తెలిపారు. 2014లో అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించి సమర్థవంతమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని పేర్కొన్నారు. తూఫ్రాన్‌లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ రెండో స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తున్న బీజేపీ సింహం ఈటల రాజేందర్‌ను చూసి కేసీఆర్ భయపడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భూ నిర్వాహితులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారన్నారు. తెలంగాణకు తొలి సీఎంను దళితుడిని చేస్తానని చెప్పి ఆయన మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రజల ఆదాయం పెంచుతానని తన కుటుంబ ఆదాయం మాత్రమే పెంచుతున్నారని దుయ్యబట్టారు.
ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ ఇరిగేషన్ స్కామ్‌లు చేశారు : పీఎం మోదీ
"కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పెద్దగా తేడా లేదు. కాంగ్రెస్ సుల్తానులను పెంచి పోషిస్తే.. బీఆర్‌ఎస్ నిజాంలను పోషించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బోఫోర్స్ వంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు ప్రతిదాంట్లో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. దేశంలో కాంగ్రెస్ అవినీతిక పాల్పడితే.. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు."- నరేంద్ర మోదీ, ప్రధాని