PM Modi: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతారని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం మిగిలిన మూడు రాష్ట్రాల సీఎంల విషయంలో గత కొన్ని రోజులుగా కొనసాగిస్తున్న అనిశ్చితికి మెల్లగా తెరదించుతోంది. ఆదివారం మణిపుర్ ముఖ్యమంత్రిగా ఎన్.బిరేన్ సింగ్ పేరును ప్రకటించింది. భాజపా శాసనసభాపక్ష సమావేశం ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో వరుసగా రెండోసారి మణిపుర్ పగ్గాలను బీరేన్ చేపట్టనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్, గోవా భాజపా సీఎం పేర్లు కూడా సోమవారం ఖరారు కానున్నాయి. కొంత వ్యతిరేకత ఉన్నా.. రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రులు పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్‌లే ముందంజలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు భాజపా విజయం సాధించిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న కసరత్తును ప్రధాని మోదీ సమీక్షించారు. జరుగుతున్న పరిణామాలను ఆయనకు హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు ఆదివారం ఇంపాల్‌కు వెళ్లడంతో ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి మణిపుర్ సీఎం పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర మంత్రుల సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగే తమ సారథిగా కొనసాగాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరో సీనియర్ ఎమ్మెల్యే బిశ్వజిత్ సింగ్ కూడా సీఎం పదవికి పోటీపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీరేన్‌ను గవర్నర్ గణేశన్ ఆహ్వానించారు. తాజా ఎన్నికల్లో 60 స్థానాలు ఉన్న మణిపుర్ అసెంబ్లీలో భాజపా 32 సీట్లు నెగ్గి అధికారం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఉత్తరాఖండ్ రేసులో పలువురు
ఉత్తరాఖండ్ సీఎం పీఠంపై కొనసాగుతున్న సస్పెన్స్ కూడా వీడనుంది. సోమవారం దేహ్రాదూన్‌లో కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు. 70 స్థానాల ఉత్తరాఖండ్ అసెంబ్లీలో భాజపా 47 సీట్లు నెగ్గి సంపూర్ణ మెజారిటీ సాధించింది. వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓడిపోవడంతో పగ్గాలెవరికి అప్పగించాలన్న విషయంపై గత కొన్ని రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఓడినా మళ్లీ ధామిని సీఎంగా కొనసాగించాలని కొందరు భావిస్తుంటే, మరికొందరు మార్పు కోరుతున్నారు. కొంత మంది సీనియర్ ఎమ్మెల్యేల పేర్లతో పాటు.. రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ, కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర మంత్రి అజయ్ భట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ రేసులో ధామియే ముందున్నట్లు తెలుస్తోంది.