ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలు బయటి వ్యక్తులను పెద్ద సంఖ్యలో తీకుసురావడం వల్ల బంగాల్ కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. జల్పాయిగుడిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలకు టీకాలు అందించాలని కేంద్రాన్ని సంప్రదిస్తే.. వారు సరిగా స్పందించడం లేదని విమర్శించారు. దీంతో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని తెలిపారు.
తనపై 24 గంటల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన దీదీ.. హిందూ, ముస్లిం, ఇతరులు అందరూ కలిసి ఓటు వేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. అలా అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసిన ప్రతి బహిరంగ సభలోనూ తనని హేళన చేశారని, ఆయనపై ఎందుకు నిషేధం విధించలేదని మండి పడ్డారు.
భాజపాకు 70 సీట్లు గగనమే
ప్రస్తుతం జరుగుతున్న బంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపా కనీసం 70 సీట్లు కూడా గెలవలేదని మమత అన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్లో 100సీట్లు గెలుచుకున్నామని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన వాదనను కొట్టిపారేశారు.