ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 4 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఆదివారం లెక్కించారు. ఏపీలోని తిరుపతి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ఎం.గురుమూర్తి, కేరళలోని మలప్పురం స్థానంలో ఇండియన్ ముస్లింలీగ్ అభ్యర్థి అబ్దుస్సమద్ సమదానీ, కర్ణాటకలోని బెళగావిలో భాజపా అభ్యర్థి మంగళ విజయం సాధించారు. తమిళనాడులోని కన్యాకుమారి స్థానంలో కాంగ్రెస్ నేత విజయవసంత్ ఆధిక్యంలో ఉన్నారు.
శాసనసభ స్థానాల్లో వీరు...
10 రాష్ట్రాల్లోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు.
- కర్ణాటకలోని బసవకల్యాణ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి శరణ సలగర్, మస్కి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ గెలుపొందారు.
- తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు.
- గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా మోర్వా హదఫ్ అసెంబ్లీ స్థానంలో భాజపా నేత నిమిశా సుథర్ గెలిచారు.
- రాజస్థాన్‌లోని రాజసమంద్ స్థానాన్ని భాజపా అభ్యర్థి దీప్తి కిరణ్ మహేశ్వరి గెలుచుకున్నారు. సహద, సుజన్‌గఢ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గాయత్రి త్రివేది, మనోజ్‌కుమార్ విజయం సాధించారు.
- మధ్యప్రదేశ్‌లో దామోహ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌కుమార్ టాండన్ గెలిచారు.
- మహారాష్ట్రలోని పండర్‌పుర్-మంగల్వేద స్థానంలో భాజపా అభ్యర్థి సమాధాన్ మహాదేవ్ విజయం సాధించారు.
- ఉత్తరాఖండ్‌లోని సల్ట్ స్థానంలో భాజపా తరఫున పోటీ చేసిన మహేశ్ జీనా గెలుపొందారు.
- ఝార్ఖండ్‌లోని మధుపుర్ స్థానంలో జేఎంఎం అభ్యర్థి హఫిజుల్ హుస్సేన్ జయకేతనం ఎగురవేశారు.
- మిజోరంలోని సెర్ఛిప్ నుంచి జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) అభ్యర్థి లాల్డుహోమా గెలిచారు.
- ఒడిశాలోని పిపిలీ స్థానంలో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అభ్యర్థి నొక్సెన్ ఏకగ్రీవమయ్యారు.
ఇదీ చదవండి:మినీ సార్వత్రికంలో మెరవని సినీ తారలు!