ఒకే కాన్పులో ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన బిహార్‌లోని సివాన్ జిల్లాలో జరిగింది. ప్రసవంలో సదరు మహిళకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు జన్మించగా.. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.
ఒకే కాన్పులో జన్మించిన ఐదుగురు శిశువులు రెండోసారి...
ఇస్మాయిల్ తాకియా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఝునా, ఫూల్ జహాన్ ఖాతూన్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన ఏడాది తర్వాత ఫూల్ జహాన్ ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అయితే.. ఆ తర్వాత ఆమె మళ్లీ గర్భం దాల్చలేదు. దీంతో పట్నాలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె గర్భం దాల్చింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో.. జహాన్ గర్భంలో ఐదుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువులు జహాన్‌కు వచ్చే ఏడాది జనవరిలో ప్రసవం అవుతుందని వైద్యులు తొలుత భావించారు. అయితే.. గురువారం ఆమెకు ఆకస్మాత్తుగా నొప్పులు రాగా సివాన్‌లోని 'సదర్ ఆస్పత్రి'కి తరలించారు. ఆమెకు సాధారణ ప్రసవం చేస్తే ప్రమాదకరం అని గ్రహించిన వైద్యులు.. సిజేరియన్ చేయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ రీతా సింగ్ నేతృత్వంలోని వైద్య బృందం.. జహాన్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. ఐదుగురు పిల్లలకు జహాన్ జన్మనిచ్చింది. తమ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించిన ఘటన ఇప్పటివరకు జరగలేదని సదర్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన మహమ్మద్ ఝునా, ఫూల్ జహానా దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇప్పుడు ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు జన్మించడంపై వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు.
మహమ్మద్ ఝునా.. విదేశాల్లో పని చేసేవాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పని కోల్పోయిన అతడు స్వదేశానికి వచ్చాడు. ఇక్కడే అతను కార్మికునిగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం వారి పిల్లలను ఐసీయూ వార్డులో ఉంచి, వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి:'రేషన్ తరహాలో సబ్సిడీపై గడ్డి.. గ్రామానికో షాప్'