భారతదేశానికి పర్యటకులుగా చాలా మంది విదేశీయులు వస్తుంటారు..పోతుంటారు. అలా వచ్చిన జర్మనీ మహిళే ఫ్రైడెరిక్ ఇరినా బ్రూనింగ్. నాలుగు దశాబ్దాల కిందట భారతదేశానికి వచ్చిన ఆమె దేశ సంస్కృతికి ఆకర్షితురాలు అయ్యారు. భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే సుదేవీ మాతాజీగా మారారు. మొదట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలుగా గోసేవలో నిమగ్నమయ్యారు.
గోసంరక్షణకు లక్షలాది రూపాయిలు...
రోడ్డు ప్రమాదాల్లో గాయమైన ఆవులను చేరదీసి వాటికి చికిత్స చేయిస్తారు సుదేవీ మాతాజీ. అందుకోసం రాధా సురభి గోశాలను 1996లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో స్థాపించారు. గాయపడిన వేలాది గోవులను గోశాలకు తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఇప్పటికీ 3 వేల గోవులు గోశాలలో ఉన్నాయి. వీటి నిర్వహణకు సుమారు 80 మంది పని చేస్తుంటారు. వారిలో కొందరు పశువైద్యులు కూడా ఉన్నారు.
నాకు గోవులు అంటే చాలా ఇష్టం. అందుకే గోశాల స్థాపించాను. ఇవి(ఆవులు) కూడా మన కుటుంబ సభ్యుల లానే. వీటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతోంది. కొంత విరాళాల రూపంలో నిధుల సమకూరుతున్నాయి. సొంత డబ్బు కూడా వెచ్చించాల్సి వస్తోంది
- సుదేవీ మాతాజీ