తెలంగాణ

telangana

ETV Bharat / bharat

400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!

మైసూరులో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం జంబూ సవారీ నిర్వహించనున్నారు. ఏళ్ల తరబడి వస్తోన్న ఆచారం ప్రకారం వడయార్​ రాజకుటుంబం చేతుల మీదుగా ఉత్సవం మొదలైంది. ఆ కుటుంబ వారసుడు యదువీర్​ కృష్ణదత్త చామరాజ వడయార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!

By

Published : Oct 8, 2019, 2:59 PM IST

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే మైసూర్​లో జరిగే దసరా ఉత్సవాలు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఉత్సవాలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పర్యటకులు తరలివచ్చారు.

ఎప్పటిలానే వడయార్​ వంశానికి చెందినవారి చేతులు మీదుగా ఉత్సవం ప్రారంభమైంది. వడయార్ వారసుడు యదువీర్​ కృష్ణదత్త చామరాజ వడయార్ చేత అర్చకులు మైసూరు కోటలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం శమీ వృక్షాన్ని ఆరాధించారు.

400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!

ఏళ్ల తరబడి ఆచారంగా వస్తోన్న'వజ్రముష్టి కళగ' అనే సంప్రదాయ యుద్ధపోటీలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం జంబూ సవారీ నిర్వహించనున్నారు. ఇందుకోసం గజరాజులను సిద్ధం చేస్తున్నారు. జంబూ సవారీని వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. బన్ని మంటప మైదానంలో జరిగే కాగడాల ప్రదర్శనకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

విశేషాలు...

జానపద నృత్యాలు, దివిటీల విన్యాసాలతో మైసూరు వీధుల్లో సందడి నెలకొంది. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కచేరీలు, ఏనుగుల ఊరేగింపులు, నాట్యం చేసే బొమ్మలు దసరాకు కొత్త శోభను తెచ్చాయి. వడయార్‌ రాజకుటుంబీకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఎందుకింత ప్రత్యేకం..?

మైసూరు ఉత్సవాల సందడి దసరా రావడానికి నెల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మైసూర్ పరిసరాలు, చుట్టుపక్కల గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా పండుగ నిర్వహిస్తారు. ఆటల, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు... ఇలా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు.

400 ఏళ్ల నుంచి..?

మైసూరుకు చెందిన రాజ కుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు ఈరోజుకీ అంతే ఉత్సాహంతో జరుగుతుండటం విశేషం. మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరుపుతున్నారని చరిత్ర చెబుతోంది. మొదట్లో వడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినా ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి.

ఈ రోజే కీలకం...

గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి, అందులో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. నేడు ఈ అంబారీ లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మైసూర్ ప్రధాన వీధుల్లో సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలక ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని గజరాజులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details