దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం అసాధారణమైనది. ప్రాంతీయ ఆకాంక్షల మేరకు పనిచేసే నాయకుడికే ప్రజలు పట్టం కడతారనేందుకు కేజ్రీవాల్ గెలుపు ఓ ఉదాహరణ. దిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన రాఘవ్ చంద్ర ‘ఆప్’ తరఫున పోటీచేసినవారిలో అత్యంత పిన్నవయస్కుడు. తాను విజయం సాధించిన వెన్వెంటనే ఈ ఎన్నికల్లో ‘ఆప్’ గెలుపునకు కారణాలను ఓ 'ట్వీట్'లో ఏకరవు పెట్టారు. విద్య, ఆరోగ్య వ్యవస్థలను అనూహ్యంగా సంస్కరించి; ఆయన వాటిని సామాన్య ప్రజలకు చేరువ చేయడంతో పాటు ఒక పరిమితి మేరకు ప్రతి నెల విద్యుత్తు, మంచినీళ్లను ఉచితంగా అందించడాన్ని దిల్లీ ప్రజలు రెండు చేతులూ సాచి స్వాగతించినట్లు రాఘవ్ చంద్ర తన ‘ట్వీట్’లో వివరించారు.
ప్రాంతీయ ప్రతినిధిగా ఆప్
గడచిన అయిదేళ్ల కాలంలో క్షేత్రస్థాయితో నిరంతరం అనుబంధం కొనసాగిస్తూ ప్రజారంజకంగా పాలించిన ఫలితమే ‘ఆప్’ విజయమనడంలో మరో మాట లేదు. జాతీయవాద అజెండాతో భాజపా ఎన్నికల బరిలో దూకింది. మరోవంక అచ్చమైన ప్రాంతీయ ప్రతినిధిగా ‘ఆప్’ జనం ముందుకు వెళ్ళింది. 53 శాతానికిపైగా ఓట్లు 62 సీట్లతో ‘ఆప్’కు ఘనంగా పట్టంకట్టడం ద్వారా ప్రజ తమకు కావాల్సిందేమిటో తేటతెల్లం చేసింది.
హనుమాన్ చాలిసా రక్షగా..
ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు, రెచ్చగొట్టే ప్రసంగాలకు దూరంగా మెలగిన కేజ్రీవాల్ అడుగడుగునా సంస్కారవంతంగానే ప్రవర్తించారు. భాజపా ప్రవచిస్తున్న జాతీయవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకో ఏమోగానీ కేజ్రీవాల్ సైతం మత ప్రతీకలను ఈ దఫా విస్తృతంగానే వినియోగించారు. టీవీ షోలలో హనుమాన్ చాలిసా పఠనం వంటివీ మెజారిటీ వర్గం ఓట్లు ‘ఆప్’కు దూరం కాకుండా నిలువరించి ఉండవచ్చు. మైనారిటీ ఓట్లను గణనీయంగా దక్కించుకున్న ‘ఆప్’, ఇంచుమించుగా అదే స్థాయిలో మెజారిటీ వర్గం మనసు గెలుచుకోగలగడమే ఇందుకు నిదర్శనం. గతంతో పోలిస్తే దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినప్పటికీ, ఆ ప్రభావం ‘ఆప్’ ఓటింగ్‌పై పెద్దగా పడకపోవడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ సమీప ప్రత్యర్థి భాజపా 38.5 శాతం ఓట్లతో ఎనిమిది సీట్లకు పరిమితమైంది.దిల్లీని వరసగా మూడు పర్యాయాలు పాలించిన కాంగ్రెస్ మాత్రం 63చోట్ల ధరావతులు కోల్పోయి ఒక్క సీటూ గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడటం విస్మయపరచింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సున్నా సీట్లకే పరిమితం కావడం గమనార్హం.
నచ్చితేనే ఓటు వేయండి!
గడచిన అయిదేళ్ల పాలన నచ్చితేనే తమకు ఓట్లు వేయాలని, లేనిపక్షంలో ఓటు వేయవద్దని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ విస్పష్టంగా చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని వెల్లడించింది. విద్య, ఆరోగ్యం, విద్యుత్తు వంటి కీలక అంశాలపై విప్లవాత్మక నిర్ణయాలు వెలువరించిన కేజ్రీవాల్ దిల్లీ వాసుల మనసు దోచుకున్నారడంలో సందేహం లేదు. దిల్లీ ప్రజలకు 200 యూనిట్ల మేర విద్యుత్తును ప్రతి నెల ఉచితంగా అందించాలన్న ‘ఆమ్ ఆద్మీ’ నిర్ణయం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. 201-400 యూనిట్ల మధ్య వినియోగించుకున్న విద్యుత్తుకుగాను చెల్లించాల్సిన బిల్లులో కేవలం సగం కడితే సరిపోతుందంటూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ఆప్’ ప్రభుత్వం చేసిన ప్రకటన- దిగువ మధ్యతరగతితోపాటు, మధ్యతరగతి వర్గాన్నీ ఆ పార్టీకి చేరువ చేసింది. దాంతోపాటు ఇంటింటికీ ప్రతి నెలా 20వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయడం, టికెట్ చెల్లించకుండానే బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించడం వంటివి కేజ్రీవాల్ ప్రతిష్ఠను మరింత పెంచాయి. ఉచితాల పేరిట జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించినా కేజ్రీవాల్ వెనకడుగు వేయలేదు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరిన్ని ప్రజాకర్షక పథకాలను చేర్చారు.
వృద్ధులకు తీర్థయాత్రలు...
దిల్లీలోని 10 లక్షలమంది వృద్ధులను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకువెళతామని ‘ఆప్’ వాగ్దానం చేసింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని విద్యార్థులకూ విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ హామీలతోపాటు విద్య, వైద్య రంగాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకువచ్చిన సంస్కరణలు దిల్లీ ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. కిలోమీటరు పరిధిలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవిధంగా ‘మొహల్లా క్లినిక్కు’ల పేరిట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన ఆరోగ్య సేవలతోపాటు, ఔషధాలనూ అందించారు. తమ ఇళ్లకు సమీపంలోనే నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రావడమన్నది దిల్లీ ప్రజలు మునుపెన్నడూ ఊహించని అంశం. మరోవంక ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచి, బోధన నాణ్యతను పెంచడం ‘ఆప్’ను జనానికి మరింత దగ్గర చేసింది. పాఠశాలలు, కళాశాలల నాణ్యతను పెంచేందుకు కేజ్రీవాల్ తొలి ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్లో ఏటికేడు విద్యకు కేటాయింపులు పెరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ. 2019లో కేజ్రీవాల్ ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 26శాతం నిధులు కేటాయించింది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ ఈ స్థాయిలో విద్యకు నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. జనంతో సన్నిహితంగా మెలగుతూ, ప్రాంతీయ ఆకాంక్షలకు పెద్దయెత్తున పట్టం కట్టిన ఫలితమే దిల్లీ బరిలో కేజ్రీవాల్ విజేతగా నిలవడానికి కారణమనడంలో మరో మాట లేదు! - క్రిషానంద్ త్రిపాఠి
ఇదీ చూడండి:దిల్లీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో మాటలయుద్ధం