విపక్షాలకు దీదీ షాక్- కీలక సమావేశం బహిష్కరణ విపక్ష పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు. జనవరి 13న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరగనున్న విపక్షాల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
"బంగాల్లో భారత్ బంద్ సందర్భంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ద్వంద్వనీతి ప్రదర్శిస్తూ, హింసకు పాల్పడ్డాయి. అందుకే నేను సోనియా గాంధీ నేతృత్వంలో జరగనున్న విపక్షాల సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నా."- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
ఒంటరిగా పోరాడుతా..
మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు నిన్న భారత్ బంద్ పాటించాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైలు రోకోలు, ఆందోళనలు నిర్వహించాయి. దేశంలో నిరసనలు శాంతియుతంగా సాగినప్పటికీ.. బంగాల్లో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ద్వంద్వ నీతి ప్రదర్శించాయని మమత ఆరోపించారు.
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న హింసకాండ వల్ల తలెత్తున్న సమస్యలపై చర్చించేందుకు సోనియా గాంధీ విపక్షాల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరించిన మమత... బంగాల్లో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:2019-20లో భారత వృద్ధిరేటు 5 శాతమే!