భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీ సభ్యులు పాకిస్థాన్‌ను ఎందుకు తెరపైకి తీసుకొస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో జరిగే ఎన్నికల్లో నడ్డా పోటీ చేయాలనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. అందుకే బిహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే పాక్ టీవీ ఛానెళ్లను చూస్తున్నారని అన్నారు.
'ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాకిస్థాన్ ప్రస్తావన ఎందుకు?'
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ స్పందింంచింది. భారత్‌లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పాకిస్థాన్‌ను ఎందుకు తెరపైకి తీసుకుని వస్తున్నారని సూటిగా ప్రశ్నించింది.
'పాకిస్థాన్‌ను బూచిగా చూపించే రాజకీయాలు మానాలి'
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైన్యానికి అండగా నిలుస్తూ వచ్చిందని గుర్తు చేశారు. ఇకపై కూడ అలాంటి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భాజపా నేతలు కేపీకే (కాశ్మీర్, పాకిస్థాన్, కబ్రిస్థాన్) లను అడ్డం పెట్టుకుని చేసిన రాజకీయం ఇకపై చెల్లదన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మెరుగైన పాలన, నిరుద్యోగాన్ని రూపుమాపడం, మహిళల రక్షణ వంటిని ప్రాధాన అస్త్రాలుగా వాడుకోవాలని హితవు పలికారు.