మధ్యప్రదేశ్ రాజకీయం 'పులి' చుట్టూ తిరుగుతోంది. పులి ఇతివృత్తంగా పంచ్ డైలాగులతో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
జులై 2న రాష్ట్ర కేబినెట్ విస్తరణ సందర్భంగా భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా 'పులి ఇంకా బతికే ఉంది' అని వ్యాఖ్యానించడం ఈ డైలాగ్ వార్‌కు దారితీసింది. ఇందుకు ప్రతిగా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో సింధియా వర్గానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆయన వర్గానికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సింధియా... కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'పులి ఇంకా బతికే ఉంది' అని గుర్తుంచుకోవాలని వారిద్దరికీ సూచించారు.
'పులుల స్వభావం ఏమిటో తెలుసా'
సింధియా వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. 'నీకు పులి స్వభావం తెలుసా? ఒక అడవిలో ఒకే పులి జీవిస్తుంది' అని ట్వీట్ చేశారు.