బారెడు పొద్దెక్కినా చాలామంది నిద్రలేవడానికి బద్ధకిస్తారు. కానీ, కేరళకు చెందిన 15 ఏళ్ల అలిఫా అనాస్ మాత్రం.. సూర్యుడితో పోటీ పడి నిద్ర లేస్తుంది. ఆపై లేడిబర్డ్ సైకిలెక్కి నాన్నకు సాయం చేస్తోంది. కనీసం వంద ఇళ్లకు న్యూస్ పేపర్ చేరవేస్తోంది.
ఎర్నాకులం, నెల్లికుజికి చెందిన అలిఫా తండ్రి అనాస్ ఓ న్యూస్ పేపర్ డిస్టిబ్యూటర్. తెల్లారకముందే నాన్న కుటుంబం కోసం పడే కష్టాన్ని చూసి.. ఆయనకు సాయంగా ఉండాలనుకుంది అలిఫా. సైకిల్ నేర్చుకున్నదే ఆలస్యం నాన్నతో పాటు తానూ పేపర్ వేసేందుకు సిద్ధమైంది. రోజూ ఉదయం కొత్త మంగళం నుంచి తండ్రి న్యూస్ పేపర్లు తీసుకురాగానే.. ఆ వార్తా పత్రిక కట్ట సైకిల్ బుట్టలో వేసుకుని ప్రయాణం మొదలుపెడుతుంది.