"మోదీకి ఎదురేలేదు... ఎక్కడ చూసినా కాషాయ ప్రభంజనమే.. వ్యూహరచనలో షా-మోదీ ద్వయాన్ని మించినోళ్లు లేరు"... రెండేళ్ల కిందట భాజపా విజయాలను చూసిన ఎందరో రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య జనం నోట వచ్చిన మాటలివి. నిజంగా అంతలా ఆధిపత్యం ప్రదర్శించింది భాజపా.
2014లో తొలిసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైన అనంతరం.. వరుసగా వచ్చిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయం. 2017లో ఒకానొక సమయంలో.. దేశంలోని 71 శాతం భూభాగంలో అధికారంలో ఉంది భాజపా. 2014లో తొలిసారి కేంద్రంలో అధికారం చేపట్టే సమయానికి భాజపా పాలిత రాష్ట్రాలు ఏడే. 2018 నాటికి ఆ సంఖ్యను 21కి తీసుకొచ్చింది.
అయితే.. ఇదంతా గతం. ఆ తర్వాతే భాజపాకు పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు వరుస ఎన్నికల్లో ఓటములతో డీలా పడిపోతోంది. ఇటీవలి మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన నాటికి భాజపా పాలిత రాష్ట్రాల భూభాగం 40 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత ఝార్ఖండ్‌లో ఓటమితో ఇదింకా తగ్గింది.
5 రాష్ట్రాల ఎన్నికలతో మొదలు...
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో భాజపా ఓటములు ప్రారంభమయ్యాయి. అప్పుడు మిజోరంలో గెలిచినా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణలోనూ ఓటమే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ నుంచి తెలుగు దేశం బయటకురాగా.. అక్కడా భాజపా అధికారానికి దూరమైనట్లయింది. 2018 డిసెంబర్లో రాష్ట్రపతి పాలనతో జమ్ముకశ్మీర్నూ కోల్పోయింది.
సార్వత్రికం తర్వాతా అదే....
అన్ని ఓటములు పలకరించినా.. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్డీఏ. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన మెజార్టీ సాధించింది. అయితే.. భాజపాకు ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాతా పరాజయాల నుంచి బయటపడలేదు.
వరుసగా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాజపాకు ఓటములే ఎదురయ్యాయి. ఎన్నో నాటకీయ పరిస్థితుల నడుమ కర్ణాటకలో అధికారాన్ని సొంతం చేసుకున్నా.. మహారాష్ట్రలో షాక్ తగిలింది. ఆ తర్వాత ఝార్ఖండ్‌లోనూ ఎదురుదెబ్బే. కీలక రాష్ట్రాలన్నింటిలో అధికారానికి దూరమైన భాజపా.. తాజాగా దిల్లీలో గెలవలేకపోయింది.
పదును తగ్గిందా..?
అప్పుడు పనిచేసిన మోదీ పవనాలు- చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా ప్రభ ఏమైంది..? భాజపాకు విజయాలు ఎందుకు దూరమయ్యాయి? మోదీ-షా ద్వయం వ్యూహాల్లో పదునుతగ్గిందా? అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. నిజంగానే భాజపాకు ఒక్కటంటే ఒక్క పెద్ద విజయమూ లేదు. ఇవన్నీ భాజపాను సందిగ్ధంలో పడేశాయి.