కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దీక్ష కొనసాగుతోంది. శారదా కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆయన నివాసానికి చేరుకోవడంపై తీవ్రంగా స్పందించారు.
రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని...
కమిషనర్‌ను విచారించేందుకు సీబీఐ వద్ద ఎలాంటి వారెంటు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీదీ. పోలీసు శాఖతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని తమ గుప్పిట పెట్టుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వంపై దాడికి కేంద్రం బలగాలను పంపిస్తున్నారని ఆక్షేపించారు.
రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. మెట్రో ఛానల్ వద్ద చేపడుతోన్న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కొనసాగుతోంది. విపక్షాల ఐక్యత సభను నిర్వహించినందుకే భాజపా ఇదంతా చేస్తోందని, ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమేనన్నారు. రాష్ట్రంలో తిరుగుబాటు రావాలని మోదీ- అమిత్‌షా ద్వయం కోరుకుంటోందని తెలిపారు.
కేంద్రానికి తలొగ్గేది లేదు
ప్రాణాలనైనా అర్పిస్తాను కానీ కేంద్ర సర్కారు ముందు తలొంచేది లేదన్నారు మమత. కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రపంచంలోనే ఉన్నతమైన అధికారని కితాబిచ్చారు. విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి ‘శారద యజమానుల్ని అరెస్టు చేసింది తామేనని గుర్తుచేశారు. పోలీసులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాధినేతగా తన బాధ్యత అని, సీబీఐ అధికారుల్ని అరెస్టు చేసే అవకాశమున్నా విడిచిపెట్టామని తెలిపారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటుందా అని ప్రశ్నించారు. మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పలువురి నేతల మద్దతు
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌తో సహా తదితర నేతలు మద్దతు ప్రకటించారు.
తృణమూల్ శ్రేణుల ఆందోళనలు
రాష్ట్రంలో సీబీఐ తీరుపై బెంగాల్ అంతటా ఆందోళనలు చేపట్టాయి తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు. రిష్రా రైల్వే స్టేషన్ వద్ద రైలు రోకో నిర్వహించారు. రాత్రిని సైతం లెక్కచేయకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు. రహదారులను దిగ్బంధం చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు.