అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలోని ప్రతి క్షణం ఆయనకు గుర్తుండిపోయేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ మోటేరా స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన నమస్తే ట్రంప్ కార్యక్రమంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.
పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24న ట్రంప్ ఆగ్రాకు వెళ్లి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ లోపలకు ప్రవేశించే ముందు ఆయనకు 600గ్రాములు బరువైన వెండి తాళాన్ని బహుమానంగా ఇవ్వనుంది ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్. 'గేట్లు తెరిచి.. ఆగ్రాలోకి స్వాగతం పలుకుతున్నాం' అనే సందేశం ఇచ్చేలా ఇలా ఏర్పాటు చేశారట అధికారులు. ఈ మేరకు ఆగ్రా మేయర్ నవీన్ జైన్ వెల్లడించారు.
సుందరంగా తయారైన ఆగ్రా..
ట్రంప్ మెప్పు పొందేందుకు యూపీ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ట్రంప్ పయనించే మార్గంలోని రోడ్లన్నీ ఆయన చిత్రాలు, స్వాగత నినాదాలతో నిండిపోయాయి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. వీధులకు ఇరువైపులా ప్రత్యేక డిజైన్లు, లైట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.