వ్యవసాయం రంగం సమస్యలు, రైతులకు ఇవ్వాల్సిన హామీలపై మార్చి 11న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖమంత్రి, సహాయ మంత్రి, భాజపా సీనియర్ నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీకి హాజరైన భారత ఆహార, వ్యవసాయ మండలి ఛైర్మన్ ఎమ్జే ఖాన్ను ఈటీవీ భారత్ ఇంటర్యూ చేసింది.
సమావేశంలో ఏఏ అంశాలపై చర్చించారు? ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుకు సంబంధించిన హామీలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?
చాలా విషయాలు చర్చించాం. అందులో ఒకటి రైతుల పింఛను. రైతులు వృద్ధ వయసులో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి డబ్బులు అందించేందుకు కిసాన్ పింఛను యోజనపై చర్చ జరిగింది. మరో సమావేశం అనంతరం దీనిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష నగదు బదిలీ కింద రైతులకు అందిస్తున్న రూ.6వేలను పెంచాలన్న డిమాండ్ వినబడుతోంది. కృషి వికాస్ యోజన సహా ఉద్యాన పంటల్లో ధరల స్థిరత్వం కోసం రిజర్వు ధరను ప్రకటించటంపై చర్చించాం.
రహదారులు పక్కన గోదాములు నిర్మించాలి. అందులోనే ప్రాసెసింగ్ చేయాలి. ఇవి వ్యాపారులకు, రైతులకు అందుబాటులో ఉంటాయి. ఎగుమతులు పెంచటానికి కొత్త పథకం తీసుకురావాలని నిర్ణయించాం. రైతులు భూసమస్యలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. వీటి కోసం భూసంస్కరణలు తీసుకురావాలి. మార్కెట్ సంస్కరణలకు సంబంధించినంత వరకు... నిబంధనలు సడలించాలని నిర్ణయించాం.