ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారీ మెజారిటీతో ఎన్నికైనందుకు భారత్‌కు శుభాకాంక్షాలు తెలియజేశాయి అందులోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు. ప్రపంచ శాంతి, భద్రత కోసం కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మరో మూడు దేశాలు ఐర్లాండ్, మెక్సికో, నార్వేలకూ అభినందనలు తెలిపాయి.
75వ జనరల్ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షునిగా ఎన్నికైనందుకు టర్కీ సీనియర్ దౌత్యవేత్త వోల్కన్ బోజ్కిర్కు అభినందనలు తెలిపారు ఐరాసలో అమెరికా ప్రతినిధి, రాయబారి కెల్లీ క్రాఫ్ట్. అలాగే యూఎన్ఎస్సీలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికైన భారత్, ఐర్లాండ్, మెక్సికో, నార్వేలకు శుభాకాంక్షలు చెప్పారు. కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
చైనా కూడా నూతనంగా ఎన్నికైన దేశాలకు అభినందనలు తెలిపింది. 2021 జనవరి 1 నుంచి యూఎన్ఎస్సీలో అధికారిక బాధ్యతలు చేపట్టనున్న నూతన సభ్య దేశాలతో ఫలవంతంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రష్యా ట్వీట్ చేసింది. ఫ్రెంచ్, బ్రిటన్ కూడా నాలుగు దేశాలకూ అభినందనలు తెలిపాయి.
వియత్నాం, ఎస్తోనియా, బెల్జియం, డొమెనికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా కూడా నూతనంగా ఎన్నికైన సభ్య దేశాలకు అభినందనలు తెలిపాయి.