అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జికి ఇటీవల జిల్లా అధికారులు సీలు వేశారు. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను పోలీసు, రెవెన్యూ అధికారులు చూపించారు. దీన్ని సవాల్ చేస్తూ లాడ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ ఎం.ఎస్.రమేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది.
పోలీసులు చెప్పే వివరణతో ఏకీభవించలేమని, అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం లేని నేపథ్యంలో అది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘లివింగ్ టు గెదర్’ విధానంలో సహజీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో, అలాగే లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని స్పష్టం చేశారు.