తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు మరో పదేళ్లు రిజర్వేషన్లు

లోక్​సభ, రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినేట్​ ఆమోదం తెలిపింది. 2020 జనవరితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2030 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్​ ముందుకు బిల్లు తీసుకురానుంది.

Union Cabinet
కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​

By

Published : Dec 4, 2019, 5:03 PM IST

Updated : Dec 4, 2019, 7:54 PM IST

చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు మరో పదేళ్లు రిజర్వేషన్లు

చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పొడిగింపునకు కేంద్ర కేబినేట్​ పచ్చజెండా ఊపింది. మరో 10 ఏళ్లు కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఆంగ్లో-ఇండియన్​కు రిజర్వేషన్​ కోటాను తొలగించినట్లు సమాచారం.

ప్రస్తుతం లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల వ్యవధి 2020 జనవరి 25తో ముగుస్తుంది. ఈ క్రమంలో శీతాకాల సమావేశాల్లోనే రిజర్వేషన్ల పొడిగింపు బిల్లు తీసుకురానుంది కేంద్రం.

"ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంలో ప్రాధాన్యం తగ్గినట్లు గుర్తించాం. వారికి రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020లో ముగిసే కాల వ్యవధి 2030 వరకు కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం చేకూర్చే దిశలో ఇది గొప్ప నిర్ణయం. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అందులోని అన్ని విషయాలు తెలుస్తాయి."

-ప్రకాశ్​ జావడేకర్, కేంద్ర మంత్రి

ఆంగ్లో-ఇండియన్​ రిజర్వేషన్​పై అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో 84 మంది ఎస్సీ, 47 మంది ఎస్టీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీల్లో 614 మంది ఎస్సీ, 554 మంది ఎస్టీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు ప్రకాశ్.

ప్రస్తుతం లోక్​సభలో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లను నామినేట్​ చేసేందుకు వీలుంది. కానీ.. ఇప్పటి వరకు నియామకం జరగలేదు.

ఇదీ చూడండి: నిండు గర్భిణీని 6 కిలోమీటర్లు డోలీలో మోస్తూ...

Last Updated : Dec 4, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details