తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పురుషులతో పోలిస్తే మహిళా నిరుద్యోగులే అధికం'

దేశంలో లింగ వివక్ష కారణంగా మహిళల్లో నిరుద్యోగం అధికంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. సమాన విద్యార్హతలు ఉన్న పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగ శాతం రెట్టింపు ఉందని తెలిపింది.

'పురుషులతో పోలిస్తే మహిళా నిరుద్యోగులే అధికం'

By

Published : Aug 31, 2019, 5:05 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

దేశంలో ఉద్యోగాల్లో లింగభేదానికి సంబంధించి మరో చేదు నిజం వెలుగుచూసింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగం రెండు రెట్లు అధికంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. సమాన విద్యార్హతలు ఉన్న నిరుద్యోగులపై హార్వార్డ్​ విద్యార్థులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి.

హార్వార్డ్​ విద్యార్థులు రేచల్​ లావెన్​సన్​, లైలా ఓకేన్​ 'జెండర్​ ఇన్​క్లూషన్​ ఇన్​ హైరింగ్​ ఇన్​ ఇండియా' పేరుతో ఈ నివేదిక తయారు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే వయసు, విద్యార్హతలు ఉన్న మహిళల్లో నిరుద్యోగం 8.7 శాతంగా ఉందని తెలిపారు. అదే పురుషుల్లో 4 శాతం మాత్రమే నిరుద్యోగులని స్పష్టంచేశారు.

"ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. వారి నిర్ణయాలు, పని వెతుక్కునే సామర్థ్యాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ విషయంలో అదనపు అడ్డంకులు ఉంటాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా వెల్లడించింది. ఫలితంగా లింగవివక్షతో మహిళల్లో నిరుద్యోగం పెరుగుతోంది."

- నివేదిక

ఈ అంశాలే ఆటంకాలు

అధ్యయనం కోసం దేశంలోని 200 రకాల ఉద్యోగాలను ఎంచుకున్నారు. 2016-17 మధ్యకాలంలో 2,11,004 మంది అభ్యర్థుల నుంచి వచ్చిన 2,86,991 దరఖాస్తులను పరిశీలించారు. విద్యార్హత, అనుభవం, నియామకం, అవకాశాలు, దరఖాస్తు ప్రక్రియల్లో ఏదో రకంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గమనించారు.

లింగ వివక్ష

భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో లింగ వివక్ష నేరంగా పరిగణిస్తారు. అయితే కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉద్యోగ నియామకాలను లింగ వివక్ష ప్రభావితం చేస్తోందని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని తెలిపింది.

మార్పులు అవసరం

మహిళలకు తగిన ప్రాధాన్యం లభిస్తే భారత స్థూల జాతీయోత్పత్తి 27 శాతం పెరుగుతుందని అంచనా వేసింది నివేదిక. ఇందుకు ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు అవసరమని సూచించింది.

ఇదీ చూడండి: జీడీపీ క్షీణతకు మోదీనే కారణం: కాంగ్రెస్​

Last Updated : Sep 28, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details