దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే వీర జవాన్లకు శత్రు సైనికులు, ఉగ్రవాదుల తూటాల నుంచి రక్షణ లభించబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో, కఠిన మార్గదర్శకాలకు అనుగుణంగా భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వారికి అందుబాటులోకి వస్తున్నాయి. వందకు పైగా దేశాల్లో ఆదరణ పొందిన ఈ కవచాలు అధునాతన తూటాల నుంచీ మన సైనికులను రక్షించనున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ తర్వాత తూటా రక్షణ కవచాలకు సంబంధించి స్వీయ జాతీయ ప్రమాణాలను కలిగిన దేశంగా భారత్ అవతరించింది. దేశ రక్షణ బలగాల కోసం 1.86 లక్షల జాకెట్లు సరఫరా అయ్యాయి.
దుర్భేద్య రక్షణ
* ఏకే-47 తుపాకీ నుంచి సెకెనుకు 700 మీటర్ల వేగంతో దూసుకొచ్చే హార్డ్‌స్టీల్ కోర్ తూటాల నుంచి కూడా ఈ కవచాలు రక్షణ కల్పిస్తాయి. 360 డిగ్రీల్లో ఎక్కడి నుంచి తూటా దూసుకొచ్చినా సైనికుడికి ఏమీకాదు.
* వీటిలోని ‘డైనమిక్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్’ వ్యవస్థ వల్ల 8 కిలోల జాకెట్ కూడా 4 కిలోల మాదిరిగా తేలికగా అనిపిస్తుంది. జాకెట్‌కు మంటలు అంటుకుంటే ఒక బటన్ నొక్కిన వెంటనే జాకెట్ మొత్తం విడిపోయే ఏర్పాట్లున్నాయి.