మహిళా సాధికారతకై బిహార్ వనితల 'సైకిల్ యాత్ర..!' మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనుకున్నారు బిహార్‌కు చెందిన ఇద్దరు యువతులు. ధైర్యంగా ముందుకొచ్చారు. పట్నా కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో ఎలాంటి భద్రతా లేకుండానే సైకిళ్లపై భారత యాత్రకు బయల్దేరారు ఎన్సీసీకి చెందిన అంకితా రాజ్, అష్రఫా ఖాటూన్. అక్టోబర్ 17న మొదలైన వీరి ప్రయాణం ఝార్ఖండ్‌లోని రాంచీకి చేరింది.
పట్నాలో మొదలైన వీరి సైకిల్ యాత్ర.. బిహార్ షరీఫ్, రాజౌలీ, కోడ్రమా, హాజీపుర్, రామ్‌గఢ్ మీదుగా రాంచీ చేరుకుంది. 4 నెలల్లో భారత దేశాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నారీ ధీరవనితలు. దాదాపు 8,500 కిలోమీటర్లు పయనించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఈ యాత్రలో భాగంగా... అభివృద్ధిపై ప్రధాని మోదీ ఆలోచనలు, మహిళల సాధికారత, మహాత్ముడి పరిశుభ్రతా సందేశం, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించుకున్నారు. సమాజంలో మహిళల్ని చూసే దృక్పథం మారాలని అభిప్రాయపడ్డారు.
''మేం సైకిల్‌ను ఎందుకు ఎంచుకున్నామంటే మా వద్ద అనేక రకాల థీమ్స్ ఉన్నాయి. మహిళా సాధికారత, గాంధేయ భావజాలం, కాలుష్యం, ట్రాఫిక్ నిబంధనలపై దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాం. 17న పట్నా నుంచి బయల్దేరాం. ఇది 4 నెలల పర్యటన. అనంతరం.. మా స్వరాష్ట్రానికి చేరుకుంటాం.''
- అంకితా రాజ్, బిహార్ యువతి