ట్రాఫిక్ రూల్స్ బుక్లెట్ను తలపించిన శుభలేఖ కర్ణాటక గంగావతిలో ట్రాఫిక్ నిబంధనలతో కూడిన పెళ్లి శుభలేఖ బంధుమిత్రులను ఆకట్టుకుంది.
గంగాధర్.. కనకగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. వృత్తిలోనే కాదు, సామాజిక బాధ్యతలు పాటించడంలోనూ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి. అందుకే, ఇంట్లో శుభకార్యానికి లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు.. ఆ డబ్బుతో సమాజానికి కాస్తయినా మేలు జరగాలని భావించాడు. అతడి తమ్ముడు ఆంజనేయ వివాహ మహోత్సవానికి అందరూ అవాక్కయ్యే శుభలేఖ తయారు చేయించాడు.
ఆంజనేయ వివాహం నేడే(జనవరి 26న).
ఓ వైపు అలా.. మరోవైపు ఇలా
పెళ్లి పత్రికలో ఓ పక్క ఆంజనేయ పెళ్లి వివరాలు... మరో పక్క సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్ ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించాడు గంగాధర్. ట్రాఫిక్ నియమాలు పాటించాలని పిలుపునిచ్చాడు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాడు. ఇంటింటికి వెళ్లి శుభలేఖలు పంచేటప్పుడు వారికి ట్రాఫిక్ నియమాలు, ఆన్లైన్ మోసాల గురించి దగ్గరుండి వివరించాడు.
గతంలోనూ తన కుమార్తె నామకరణం వేడుకకు ఆహ్వాన పత్రికపై ఇలాగే ట్రాఫిక్ రూల్స్ ముద్రించాడు గంగాధర్. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు పంచి ఇంటి శుభకార్యాలను అర్థవంతంగా మార్చేశాడు.
ఇదీ చదవండి:సర్కారీ కొలువులా..? సంతలో సరుకులా..?