భారత్‌లో టోల్ రాబడి.. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. రహదారులపై పన్ను వసూలుకు ఉన్న అవరోధాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రానిక్ టోల్ వంటి చర్యలు సహాయపడతాయన్నారు.
దేశంలో 1.4 లక్షల కిలోమీటర్ల రహదారులు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలో ఉన్నాయని.. 24,996 కిలోమీటర్ల రహాదారులు ప్రస్తుతం టోల్ పరిధిలో ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 27 వేల కిలోమీటర్లకు పెంచనున్నట్లు తెలిపారు.
2019 డిసెంబర్ 1 నుంచి టోల్ ఛార్జీలు ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేయనున్నట్లు తెలిపారు నితిన్ గడ్కరీ.
"టోల్ ఆదాయం ఏడాదికి రూ. 30 వేల కోట్లు ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నందున వచ్చే ఐదేళ్లలో ఈ రాబడిని ఏడాదికి రూ.లక్ష కోట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆదాయం పెరిగితే బ్యాంకులు, ఇతర మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వాటిని మరో ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది.'
--నితిన్ గడ్కరీ, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి
జీడీపీకీ మేలు
'ఒకే దేశం ఒకే ట్యాగ్-ఫాస్టాగ్-వాహనాల ఆధార్' అనే సమావేశంలో పాల్గొన్న మంత్రి ఫాస్టాగ్ కోసం ప్రీపెయిడ్ వాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన నిర్మాణంలో ఉన్న రహదారులలో దాదాపు 75 శాతం ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. నగదు రహిత వ్యవస్థ వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. అంతేకాక టోల్ ప్లాజాల వద్ద వేచి చూసే అవస్థలు తప్పుతాయని, ఫలితంగా ఇంధనం ఆదా చేయవచ్చన్నారు. దీని వల్ల జీడీపీకి మేలు జరుతుందని అభిప్రాయపడ్డారు.