ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బిహార్, ఉత్తర్ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. గత నాలుగురోజుల్లోనే.. యూపీ, బిహార్ సహా మిగతా రాష్ట్రాల్లో మొత్తం 137 మంది మృతి చెందారు.
బిహార్ విలవిల...
భారీ వర్షాలతో బిహార్ వణికిపోతోంది. వర్షాల కారణంగా ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 29కి చేరింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పడవల్లోనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
పట్నాలోని రాజేంద్ర నగర్‌లో సుమారు 5 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. నగరంలోని గాంధీ మైదానం, దాని పరిసర ప్రాంతాలు.. పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై నిలిపిన వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఆసుపత్రుల్లోకి కూడా నీరు చేరడం వల్ల వైద్య సేవలు అందించడం కష్టమవుతోంది. అనేక చోట్ల సబ్‌స్టేషన్లు నీట మునిగి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను జేసీబీలు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్నా, భగల్‌పూర్, కైమూర్ జిల్లాలో గత 48 గంటల్లో భారీవర్షపాతం నమోదైంది. వచ్చే 24గంటల్లో భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.