సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి వేడుకలు నేడు వైభవంగా జరగనున్నాయి. సుల్తాన్‌పుర్ లోధీలో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. గురుపర్వ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరుకానున్నారు. పంజాబ్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.
'ప్రార్థనలు మాత్రమే'
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రి అమిత్‌షా సహా పలువురు రాజకీయ ప్రముఖులకు ఉత్సవ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. పలువురు రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు ఉండబోవని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ నెల తొమ్మిదిన పంజాబ్ సుల్తాన్‌పుర్ లోధిలోని డేరాబాబా నానక్.. పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను కలిపే కర్తార్‌పుర్ నడవాను ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, ఇమ్రాన్‌ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. పాక్‌లోని దర్బార్ సాహిబ్‌లోనే గురునానక్ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గడిపారు.