ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల అశ్వనీ కుమార్ అలియాస్ జానీ దాదా మూడు హత్య కేసుల్లో నిందితుడు. టిక్ టాక్‌లో విలన్‌గా పాపులర్. ఇతనిపై రూ. లక్ష బహుమానం ఉంది. జానీ దాదాను పట్టుకునేందుకు పోలీసులు గత కొద్ది రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యూపీ నుంచి దిల్లీకి బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరాడు జానీ. పోలీసులకు జాడ తెలిసి బిజ్నోర్ జిల్లా బఢాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు బస్సులోకి వెళ్లి తనీఖీలు నిర్వహిస్తుండగా.. మొహానికి చేతి రుమాలు కట్టుకుని ఉన్న జానీ... తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. అనంతరం అతడిని స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించారు పోలీసులు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రెండు హత్యలతో సంచలనం..
బఢాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని తన స్వగ్రామం నౌమీ మోహల్లాలో సెప్టెంబర్ 26న రెండు హత్యలు చేశాడు జానీ. రాహుల్, కృష్ణను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ.. సెప్టెంబరు 30న మరో దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసి నికితాను దౌలతాబాద్‌లో తుపాకీతో కాల్చి దారుణంగా హత్యచేశాడు.