దేశవ్యాప్తంగా ‘పౌర’జ్వాలలు కొనసాగుతున్న వేళ దిల్లీలో నేడు ప్రధాని మోదీ చేపట్టనున్న ర్యాలీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ బహిరంగ సభకు వేదిక కానున్న రామ్‌లీలా మైదానం, పరిసర ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల అధీనంలోకి వెళ్లిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల గగనతలాన్ని ‘నో ఫ్లై’ జోన్‌గా ప్రకటించారు. కొంతమంది ఆందోళనకారులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ ఏర్పాట్లు చేశారు. రానున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తరఫున నేడు మోదీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
5000మంది ట్రాఫిక్ ఫోలీసులు
రామ్‌లీలా మైదానం చుట్టూ దాదాపు 5000 మంది ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. జాతీయ భద్రతా దళానికి చెందిన ప్రత్యేక యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ డ్రోన్ బృందాల్ని సైతం రంగంలోకి దించారు. గగనతలం నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉన్నా ఎదుర్కొనేలా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రత్యేక భద్రతా దళాలు(ఎస్పీజీ), దిల్లీ పోలీసులు కలిసి మూడంచెల్లో భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించలేదని తెలిపారు. ఇక మైదానంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీర్‌పీఎఫ్ సహా దిల్లీ పోలీసులు విభాగానికి చెందిన మొత్తం రెండు వేల మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారని వెల్లడించారు. ఎత్తైన భవనాలపై స్నైపర్ రైఫిళ్లతో బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి.