స్వేచ్ఛకు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నిలబడాలని హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలో ప్రవాస టిబెటన్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా బీజింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిబెట్, భారత జాతీయ గీతాలను ఆలపించారు. తమ నిరసనలో భాగంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
"అంతర్జాతీయ సంస్థలు, సమాజం చైనాకు వ్యతిరేకంగా నిలబడి, ఆ దేశం జవాబదారీతనంతో ఉండేలా చూడాలి. స్వేచ్ఛకు ప్రపంచస్థాయి ముప్పుగా పరిణమించిన చైనాకు వ్యతిరేకంగా నిరసన చేసి.. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. మాకు మద్దతు ఇవ్వాలని, చైనాకు వ్యతిరేకంగా సమష్టిగా నిలబడాలని కోరుతున్నాం."
-టెన్జిన్ ఖండో, నిరసనకారుల నాయకురాలు
ధర్మశాలలోని ఐదు స్వచ్ఛంద సంస్థలు కలిసి సంయుక్తంగా నిరసనల్లో పాల్గొన్నట్లు టిబెటన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ గొన్పో ధొండప్ పేర్కొన్నారు.