ఆర్థిక నుంచి విద్యుత్ శాఖకు బదిలీ అయిన కారణంగా తాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. బదిలీ కన్న ముందే వీఆర్ఎస్పై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించినట్లు వెల్లడించారు.
"నేను బదిలీ అవడానికంటే చాలా ముందే... జూలై 18వ తేదీన వీఆర్ఎస్ కోసం ప్రధాని కార్యలయాన్ని సంప్రదించాను. బదిలీకి, వీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు."
- సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి
తన వీఆర్ఎస్ ప్రతిపాదనకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశముందని ప్రకటించారు. ఇప్పటి వరకు తనుకు అండగా నిలిచినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు.
వీఆర్ఎస్కు ఆమోదం లభిస్తే అక్టోబర్ 31న పదవీ విరమణ పొందనున్నారు. నిజానికి ఆయన 2020 అక్టోబరులో రిటైర్ అవాల్సి ఉంది.
ఆర్థిక వ్యవహారాల బాధ్యతల నుంచి గురువారమే నిష్క్రమించిన గార్గ్.. నేడు విద్యుత్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.