నిర్భయ కేసులో నలుగురు దోషులకు నేడు తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరి శిక్ష అమలైంది. నలుగురు దోషులకూ ఒకేసారి మరణ శిక్షకు గురయ్యారు. 2012 డిసెంబర్ 16న బాధితురాలిపై అత్యాచారం మొదలు.. తాజాగా ఉరి శిక్ష అమలు వరకు కేసులో జరిగిన న్యాయపరమైన ప్రక్రియలు చూడండి.
2012 డిసెంబర్ 16
ఓ ప్రైవేటు బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా పారామెడికల్ విద్యార్థి నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయతో పాటు ఉన్న స్నేహితుడ్ని కిరాతకంగా చితకబాదారు. ఇద్దరిని బస్సులో నుంచి బయటకు తోసేశారు. అనంతరం బాధితులిద్దరినీ సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.
2012 డిసెంబర్ 17
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
- నిందితులను రామ్ సింగ్, ముకేశ్ కుమార్(రామ్ సింగ్ సోదరుడు), వినయ్ శర్మ, పవన్ గుప్తాగా గుర్తించారు పోలీసులు.
2012 డిసెంబర్ 18
రామ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
2012 డిసెంబర్ 20
నిర్భయ స్నేహితుడిని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు.
2012 డిసెంబర్ 21
- ఘటనలో నిందితుడిగా ఉన్న బాల నేరస్థుడిని దిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద పట్టుకున్నారు. ముకేశ్‌ను దోషుల్లో ఒకడిగా గుర్తించారు నిర్భయ స్నేహితుడు.
- ఆరో నిందితుడైన అక్షయ్ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకోవడానికి హరియాణా, బిహార్‌లో సోదాలు నిర్వహించారు పోలీసులు.
2012 డిసెంబర్ 21-22
బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఠాకూర్‌ను పోలీసులు అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఆస్పత్రిలో బాధితుల వాంగ్మూలం నమోదు చేశారు.
2012 డిసెంబర్ 23
నిరసనలపై నిషేధం విధించిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. నిరసనలను అదుపుచేయడంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ తోమర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.
2012 డిసెంబర్ 25
బాధిత యువతి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ సుభాష్ మృతి చెందారు.
2012 డిసెంబర్ 26
గుండె పోటు రావడం వల్ల యువతిని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం... సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించింది.
2012 డిసెంబర్ 29
గాయాలతో పాటు ఇతర ఆరోగ్య పరిస్థితుల కారణంగా నిర్భయ మరణించింది. ఎఫ్ఐఆర్లో నిందితులపై హత్య నేరాన్ని మోపారు పోలీసులు.
2013 జనవరి 02
లైంగిక నేరాల కేసులలో సత్వర విచారణ చేపట్టేందుకు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్... ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రారంభించారు.
2013 జనవరి 3
మేజర్లు అయిన ఐదుగురు నిందితులపై హత్య, సామూహిక అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ, అసహజ నేరాలు, దోపిడీ ఆరోపణలపై పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు.
2013 జనవరి 5
అభియోగపత్రాన్ని కోర్టు విచారణకు స్వీకరించింది.
2013 జనవరి 7
రహస్య విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.
2013 జనవరి 17
ఐదుగురు వయోజనులైన నిందితులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ ప్రారంభించింది.
2013 జనవరి 28
కేసులో హస్తమున్న బాల నేరస్థుడు మైనారిటీ(వయసు)ని జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ధరించింది.
2013 ఫిబ్రవరి 2
ఐదుగురు వయోజన నిందితులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అభియోగాలు మోపింది.
2013 ఫిబ్రవరి 28
మైనర్ నిందితుడిపై జువైనల్ జస్టిస్ బోర్డు అభియోగాలు మోపింది.
2013 మార్చి 11
నిందితుల్లో ఒకడైన రామ్ సింగ్ తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
2013 మార్చి 22
ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ వార్తలను ప్రసారం చేయడానికి దిల్లీ హైకోర్టు జాతీయ మీడియాను అనుమతించింది.
2013 జులై 5
మైనర్ నేరస్థుడిపై జువైనల్ జస్టిస్ బోర్డు విచారణ పూర్తి చేసింది. తీర్పును జులై 11కి రిజర్వు వేసింది.
2013 జులై 8
ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాల నమోదును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పూర్తి చేసింది.
2013 జులై 11
- అత్యాచారానికి ముందు రోజు ఓ వడ్రంగిని నిర్బంధించి దోపిడీకి పాల్పడిన ఘటనలో మైనర్ నిందితుడి హస్తం ఉన్నట్లు జువైనల్ జస్టిస్ బోర్డు తేల్చింది.
- కేసు వ్యవహారాలను ప్రసారం చేయడానికి మూడు అంతర్జాతీయ వార్తా సంస్థలను అనుమతిస్తూ దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2013 ఆగస్టు 22
నలుగురు వయోజన నిందితులపై చివరి విడత వాదనలు వినేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ ప్రారంభించింది.
2013 ఆగస్టు 31
జువైనల్ జస్టిస్ బోర్డు బాల నేరస్థుడిని దోషిగా తేల్చింది. మూడు సంవత్సరాలు రిఫార్మ్ హోంలో ఉంచాలని ఆదేశించింది.
2013 సెప్టెంబర్ 3
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వాదనలను ముగించింది. తీర్పును రిజర్వులో ఉంచింది.
2013 సెప్టెంబర్ 10
ముకేశ్, వినయ్, అక్షయ్, పవన్‌లను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. సామూహిక అత్యాచారం, అసహజ నేరాలు, హత్య, యువతి స్నేహితుడిపై హత్యాయత్నం వంటి 13 నేరాల్లో దోషులుగా తేల్చుతూ తీర్పు వెలువరించింది.
2013 సెప్టెంబర్ 13
నలుగురు దోషులకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.
2013 సెప్టెంబర్ 23
ట్రయల్ కోర్టు పంపిన దోషుల మరణ శిక్షపై హైకోర్టు వాదనలు ప్రారంభించింది.
2014 జనవరి 3
దోషుల అభ్యర్థనపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
2014 మార్చి 13
నిందితులకు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్ష తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
2014 మార్చి 15
సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం వల్ల ముకేశ్, పవన్‌కు విధించిన మరణ శిక్షను అత్యున్నత ధర్మాసనం నిలిపివేసింది. అనంతరం మిగిలిన ఇద్దరి శిక్షను సైతం నిలిపివేస్తూ ఆదేశించింది.
2014 ఏప్రిల్ 15
బాధితులాలి మరణ వాంగ్మూలాన్ని సమర్పించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
2017 ఫిబ్రవరి 3
దోషులకు మరణ శిక్ష విధించే అంశంపై తిరిగి వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
2017 మార్చి 27
దోషుల అభ్యర్థనలపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది.
2017 మే 5
నలుగురు దోషుల మరణ శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసు అసాధారణ కేసుల్లోకెళ్లా అసాధారణ కేసు అని అభివర్ణించింది.
2017 నవంబర్ 8
తనకు విధించిన శిక్షపై సమీక్షించాలని నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు.
2017 డిసెంబర్ 12
ముకేశ్ అభ్యర్థనకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
2017 డిసెంబర్ 15
తీర్పును పునఃసమీక్షించాలని దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు సుప్రీంను ఆశ్రయించారు.
2018 మే 4
తీర్పు సమీక్షపై ఇద్దరు దోషుల చేసిన అభ్యర్థనపై ఆదేశాలను సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది.
2018 జులై 9
ముగ్గురు నిందితుల సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2019 ఫిబ్రవరి
నలుగురు దోషులకు డెత్ వారెండ్ జారీ చేయాలని బాధితురాలి(నిర్భయ) తల్లితండ్రులు దిల్లీ కోర్టును ఆశ్రయించారు.
2019 డిసెంబర్ 10
తనకు విధించిన మరణ శిక్ష తీర్పును సమీక్షించాలని దోషి అక్షయ్ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశాడు.
2019 డిసెంబర్ 13
అక్షయ్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ... బాధితురాలి తల్లి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
2019 డిసెంబర్ 18
- అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
- నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడానికి దిల్లీ ప్రభుత్వం డెత్ వారెంట్ కోరింది.
- దోషులకు ఉన్న చివరి న్యాయపరమైన అవకాశాలను తెలియజేయాలని తిహార్ జైలు అధికారులను దిల్లీ హైకోర్టు నిర్దేశించింది.
2019 డిసెంబర్ 19
నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌నంటూ పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
2020 జనవరి 6
ఏకైక సాక్షి(నిర్భయ స్నేహితుడు)పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దోషి పవన్ తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదును దిల్లీ కోర్టు కొట్టివేసింది.
2020 జనవరి 7
నలుగురు దోషుల్ని జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని దిల్లీ కోర్టు డెత్‌వారెంట్ జారీ చేసింది.
2020 జనవరి 14
- వినయ్ శర్మ, ముకేశ్ కుమార్ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
- క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు దోషి ముకేశ్.
2020 జనవరి 17
ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు.
2020 జనవరి 25
క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టు ఆశ్రయించాడు ముకేశ్.
2020 జనవరి 28
ముకేశ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాదనలు పూర్తి చేసి, తీర్పు వాయిదా వేసింది.
2020 జనవరి 29
- దోషి అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
- క్షమాభిక్ష తిరస్కరణపై ముకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
- రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ వినయ్ కుమార్ శర్మ పిటిషన్ దాఖలు చేశాడు.
2020 జనవరి 30
- అక్షయ్ కుమార్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
- ఉరిని నిరవధికంగా వాయిదా వేయాలని నలుగురు నిర్భయ దోషులు దిల్లీ కోర్టును ఆశ్రయించారు.
- ఈ పిటిషన్‌పై స్పందించాలని తిహార్ జైలు అధికారులకు దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
2020 జనవరి 31
- నేరం చేసిన సమయంలో తాను మైనర్‌ను అన్న వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషి పవన్ గుప్తా పిటిషన్
- పవన్ గుప్తా మైనర్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
- తర్వాతి ఉత్తర్వులు వచ్చేంత వరకు దోషుల మరణ శిక్ష అమలును నిలిపివేయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.
2020 ఫిబ్రవరి 1
దిల్లీ కోర్టు నిర్ణయంపై హైకోర్టులో కేంద్రం పిటిషన్ వేసింది.
2020 ఫిబ్రవరి 5
- కేంద్రం పిటిషన్‌ను తోసిపుచ్చిన దిల్లీ హైకోర్టు
- మరణ శిక్ష అమలు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం
2020 ఫిబ్రవరి 17
మార్చి 3న మరణదండన అమలు చేయాలని దిల్లీ కోర్టు డెత్ వారెంట్లు
2020 ఫిబ్రవరి 28
మరణ శిక్షను జీవితఖైదుగా మార్చాలని పవన్ పిటిషన్
2020 ఫిబ్రవరి 29
- మరోసారి అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్
- డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలని దిల్లీ కోర్టుకు అక్షయ్, పవన్ గుప్తా
2020 మార్చి 2
- పవన్ గుప్తా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
- ఉరి శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న అక్షయ్, పవన్ పిటిషన్లు కొట్టివేత
- రాష్ట్రపతి పవన్ క్షమాభిక్ష పిటిషన్
- క్షమాభిక్ష పిటిషన్ వేసినందున మరోసారి స్టే కోరిన పవన్
- మరోసారి డెత్ వారెంట్లను నిలుపుదల చేసిన దిల్లీ కోర్టు
2020 మార్చి 5
మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసిన దిల్లీ కోర్టు
2020 మార్చి 19
- అక్షయ్ కుమార్, ముకేశ్ సింగ్ వేర్వేరుగా వేసిన పిటిషన్లు కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
- మరణ దండనపై స్టే ఇచ్చేందుకు దిల్లీ కోర్టు నిరాకరణ
- దిల్లీ కోర్టు నిర్ణయానికి దిల్లీ హైకోర్టు సమర్థన
- పవన్ వ్యాజ్యాన్ని అర్ధరాత్రి కొట్టివేసిన సుప్రీంకోర్టు
2020 మార్చి 20
తిహార్ జైలులో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు
ఇదీ చదవండి:నిర్భయ దోషుల్ని ఉరి తీసే పవన్‌కు పారితోషికం ఎంత?