ఆమ్ ఆద్మీ పార్టీ 'అభివృద్ధి మాత్రమే' ఎజెండాను నీరు గార్చడానికి 'హిందూ వర్సెస్ ముస్లిం' అంశాన్ని భాజపా తెరపైకి తెస్తున్నట్లు శరవేగంగా గుర్తించిన అరవింద్ కేజ్రీవాల్ ప్రతిగా తెచ్చిన 'మితవాద హిందూత్వం' అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. కమలనాథుల వ్యూహాన్ని తిప్పికొట్టడానికి బదులుగా ముల్లును ముల్లుతోనే ఎదుర్కోవాలన్న రీతిలో ఆయన అనుసరించిన ఈ వినూత్న పంథా ఓట్ల వర్షం కురిపించింది. తద్వారా భాజపా ప్రధానాస్త్రం నుంచి తాను లబ్ధి పొందారు. స్వీయ అభివృద్ధి ఎజెండాకు ఇది కూడా తోడు కావడం వల్ల తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు.
జై హనుమాన్!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక కన్నాట్ ప్లేస్‌లోని ప్రఖ్యాత హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఈ విషయంపై దిల్లీ భాజపా శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను నకిలీ భక్తుడిగా అభివర్ణించారు. '‘ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, నకిలీ భక్తుల వల్ల ఆలయ పవిత్రతకు చేకూరిన నష్టాన్ని సరిచేయాలని పూజారిని కోరినట్లు చెప్పారు. దిల్లీలోని హిందూ భక్తులకు తివారీ వ్యాఖ్యలు రుచించలేదు. ఒక టీవీ లైవ్ షోలో యాంకర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేజ్రీవాల్ ఎలాంటి తడబాటు లేకుండా హనుమాన్ చాలీసాను చక్కగా వల్లె వేసిన ఘటన వారి మనస్సుల్లో అప్పటికే బలంగా నాటుకుపోయింది.
ముస్లిం ఓట్లూ..
పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న నిరసన, దిగ్బంధం విషయంలో కేజ్రీవాల్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. స్థూలంగా ఆ వివాదాస్పద అంశంపై విస్పష్ట వైఖరిని తీసుకోకుండా తెలివిగా నడుచుకున్నారు. ఇది ఆయనకు కలిసొచ్చినట్లు ఫలితాల సరళి చెబుతోంది. 13 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు దాదాపు గంపగుత్తగా ఆప్‌కు పడ్డాయని వెల్లడవుతోంది. షాహీన్‌బాగ్ అంశాన్ని గట్టిగా సమర్థించినప్పటికీ ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్‌కు పోలేదు. కాంగ్రెస్ ఇప్పుడు పోరాడే పరిస్థితుల్లో లేదని, ఆప్ మాత్రమే భాజపాను ఢీ కొట్టగలదన్న నిర్ధారణకు వారు వచ్చినట్లు స్పష్టమవుతోంది.